tornadoes: నెబ్రాస్కాను చుట్టేసిన టోర్నడోలు

  • రవాణా హబ్ అయిన ఒమాహా చుట్టుపక్కలే ఎక్కువగా వ్యాప్తి
  • వాటి ప్రభావంతో 11 వేల ఇళ్లకు నిలిచిన విద్యుత్ సరఫరా
  • సుడిగాలుల విధ్వంసంతో దెబ్బతిన్న చాలా ఇళ్లు
  • లింకన్ హైవేపై ఓ టోర్నడో బీభత్సం.. ట్రక్ బోల్తా.. వీడియో వైరల్
powerful tornado sweeps across us highway in nebraska

అమెరికాలోని నెబ్రాస్కా రాష్ట్రంలో టోర్నడోలు (సుడిగాలులు) బీభత్సం సృష్టించాయి. అవి సృష్టించిన విధ్వంసంతో చాలా ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నల్లటి దుమ్ము, ధూళితో కూడిన భారీ ఈదురుగాలి సుడులు తిరుగుతూ ఆకాశాన్ని చుట్టేస్తూ.. అడ్డువచ్చిన ప్రతి వస్తువును పడేస్తూ కదలడం ఈ వీడియోల్లో కనిపించింది.

లింకన్ ఉత్తర ప్రాంతంలోని హైవేపై టోర్నడో వేగంగా ముందుకు కదులుతున్న వీడియో క్లిప్ ను ఓ వాహనదారుడు తన ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేశాడు. హైవేపై టోర్నడో కనిపించగానే కొన్ని వాహనాలు ఆగడం ఆ క్లిప్పింగ్ లో కనిపించింది. ఆ టోర్నడో హైవేను దాటి వెళ్లాక మళ్లీ వాహనదారులు ముందుకు కదిలారు. అయితే ఓ ట్రెయిలర్ ట్రక్ మాత్రం టోర్నడోలో చిక్కుకొని రోడ్డుపై పడిన దృశ్యం వీడియోలో కనిపించింది.

దీంతో వీడియోను చిత్రీకరిస్తున్న వ్యక్తి పరుగున వెళ్లి ఆ ట్రక్ లో ఎవరైనా గాయపడ్డారేమోనని చూశాడు. అయితే ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ఆ వాహన డ్రైవర్ కు ఎలాంటి గాయాలు కాలేదు.

మరోవైపు లింకన్ లో ఓ పారిశ్రామిక షెడ్ పై టోర్నడో ప్రతాపం చూపింది. దీంతో దాని పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. ఆ సమయంలో అందులో సుమారు 70 మంది ఉన్నారు. వారిలో ముగ్గురు గాయపడ్డట్లు లాంకెస్టర్ కౌంటీ అధికారులు తెలిపారు.

అమెరికా వ్యాప్తంగా ఈ వారం 70కిపైగా టోర్నడోలను ఆ దేశ జాతీయ వాతావరణ సంస్థ నమోదు చేసింది. నెబ్రాస్కాలోని రవాణా హబ్ ప్రాంతమైన ఒమాహా చుట్టుపక్కలే ఎక్కువ టోర్నడోలు వచ్చాయి. నెబ్రాస్కాపై టోర్నడోల ప్రభావంతో సుమారు 11 వేల ఇళ్లల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

అమెరికాలో టోర్నడోలు సర్వసాధారణమే. ప్రత్యేకించి అమెరికా మధ్య, దక్షిణాది ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా సంభవిస్తాయి. అయితే అవి ఎప్పుడు వస్తాయో అంచనా వేయడం మాత్రం కష్టతరమైన విషయం.

More Telugu News